September 17, 2010

Me, Myself & Movies - స్వయంకృషి

సినిమా : స్వయంకృషి

"కృషితో నాస్తి దుర్భిక్షం".
'కృషి ఉంటే.. మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు..' అంటూ వేటూరిగారు అందిచిన సందేశాత్మక గీతం ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.
కృషితో మనిషి ఏదయినా సాధించవచ్చు అంటూ, శ్రమలోని ఔన్నత్యం (dignity of labor) ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న సినిమా ఇది.


చిరంజీవి, సాంబయ్య అనే సున్నితమైన పాత్రలో నటించారు. చెప్పులు కుట్టుకొనే, చదువురాని ఒక వ్యక్తి ఎలా కష్టపడిపైకొచ్చి పెద్ద వ్యాపారవేత్త అవుతాడో ఈ సినిమా కథాంశం.
చిరంజీవికి అప్పటికి ఉన్న మాస్ ఇమేజ్ కి ఈ చిత్రం లోని పాత్ర ఒక ప్రయోగం, సాహసం అనే చెప్పుకోవాలి.

నేను ఈ సినిమా గురించి రాయటానికి అసలైన కారణం ఒకటి ఉంది. అది ఏమిటంటే:
నాకు ఈ సినిమా చూసినప్పుడల్లా మా నాన్న గుర్తుకువస్తారు. చిన్నప్పటి నుంచి మా నాన్న దెగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. మా నాన్నని నేను ఎప్పుడు ఆదర్శంగా తీసుకుంటాను. మా నాన్న రైతు కుటుంభంలో నుంచి వచ్చారు, అంటే నేను ఒక రైతు కుటుంభం నుంచే వచ్చినట్టు అనుకోండి. మా తాత ఒక రైతు.

మా తాతకి ఉన్న స్తోమతలో మా నాన్నని చదివించారు, చితూరు నుంచి హైదరాబాదు వరకు పంపించారు. తరువాత ఆ మహానగరంలో కష్టాలు పడి,
కొత్తలో వచ్చిన ఉద్యోగం చేసి, మెల్లగా ఒక మంచి ఉంద్యోగం సంపాయించుకున్నారు. కుటుంబ ఆర్ధికపరిస్థుతులు మెరుగుపరుస్తూ, మా కోసం కష్టపడుతూ, మాకు మంచి విద్యా-బుద్ధులతో సహా కావలసినవన్నీ సమకూరుస్తూ వచ్చారు. ఈరోజు మేము ఇంత మంచి పరిస్థితుల్లో ఉన్నాం అంటే మా అమ్మ-నాన్న పడ్డ కష్టమే అంతా. కాని మాకు కష్టమంటే ఏంటోతెలియకుండా పెంచారు. అందరి ఇంట్లో ఇలాంటి కథే ఉంటుంది అనుకోండి. ఇది మా కథ కాదు, మన అందరి కథ.

మా నాన్న ఎప్పుడు చెప్తుండే వారు "మీరు ఎక్కడికి వెళ్ళిన జీవితంలో ఏం చేసినా, ఎంత సాధించినా, మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దని". ఈ సినిమా చివరిలో చెప్పిన మాటలు కూడా అవే. అవి నేను ఎప్పటికి మరచిపోలేను, అలాగే మనలో ప్రతి ఒక్కరు ఇది గుర్తించాలని, గుర్తు పెట్టుకవాలని కోరుకుంటాను.

"తన ఉనికికి వృద్ధికి కారణమైన వేర్లు భూమిలో ఉన్నంత కాలం
ఏ చెట్టు అయినా
పచ్చగా ఉంటుంది... ఫలానిస్తుంది.
అలాగే తన ప్రగతికి దోహదమైన మూలాన్ని, దారిని మరిచిపోనంతకాలం
ఏ మనిషి జీవితమైన సుఖమయమవుతుంది, ఆదర్శప్రాయమవుతుంది."

No comments:

Post a Comment